హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లలో లిక్కర్ సరఫరాకు అనుమతించవలసిందిగా ఎక్సైజ్ శాఖను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు లైసెన్స్ లేని రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
లాక్‌డౌన్‌తో మూతబడ్డ లిక్కర్ షాపులను తిరిగి తెరిపించడానికి ఢిల్లీలో జూన్ 8 నుంచే అనుమతిచ్చారు. అయితే.. మందు మాత్రం వైన్ షాపుల నుంచి మాత్రమే కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చారు. బార్లు, రెస్టారెంట్లపై ఇప్పటివరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజా నిర్ణయంతో మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.