Delhi High Court
Delhi High Court comments : ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న వారిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారన్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేసింది.
ఢిల్లీకి కోటాయించిన ప్రాణవాయువు కోటా…ఎప్పుడు చేరుకుంటుందో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 348 మంది కరోనా బారిన పడి చనిపోయారు. దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత ఢిల్లీలో ఒక్కరోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. ఢిల్లీలోని అనేక ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. గంగారామ్ ఆస్పత్రి సహా అనేక ఆస్పత్రుల్లో రోగులు సకాలంలో ఆక్సిజన్ అందక అల్లాడుతున్నారు.
మరోవైపు ఆక్సిజన్ కోసం ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ రాష్ట్రానికి వస్తున్న ట్యాంకర్లను హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ అడ్డుకుంటున్నాయని ఢిల్లీ ఆరోపిస్తోంది. దీనిపై ఇటీవలే కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ కోటా పెంచడంతో పాటు…ఆ రాష్ట్రానికి వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకోవద్దని హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది.