Delhi Covid Curb : ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. త్వరలో ఆంక్షలన్నీ ఎత్తివేసే ఛాన్స్..!

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ నమోదయ్యే కరోనా కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి.

Delhi Covid Curbs : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గడంతో ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. గతకొద్దిరోజులుగా కరోనా కొత్త కేసులు స్వల్ప సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా చాలావరకు తగ్గాయి. కరోనా మూడో వేవ్ తీవత్ర తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాలు వారంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను ఎత్తేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ నమోదయ్యే కరోనా కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి. నగరంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలను సడలించింది. కరోనా కేసులు తగ్గడంతో పూర్తి స్థాయిలో ఆంక్షలను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలోనే కరోనా ఆంక్షలు ఎత్తివేతపై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

గత రెండు వారాల్లో ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సగటు సంఖ్య 4,207 ఉండగా.. ఇప్పుడు 923 కరోనా కేసులకు పడిపోయింది. జనవరి మధ్యలో 30శాతంగా నమోదైన కరోనా రోజువారీ కేసులు.. మంగళవారం (ఫిబ్రవరి 15) నాటికి కరోనా పాజిటివిటీ రేటు 1.5శాతానికి పడిపోయింది. మంగళవారం ఒక్కరోజునే ఢిల్లీలో 1.5శాతం పాజిటివ్ రేటుతో 756 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో కోవిడ్ బాధితుల కోసం కనీసం 97శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. రోజువారీ హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం కొత్త కరోనా ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా రికవరీలను (830) నమోదయ్యాయి. దేశ రాజధానిలో మొత్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3337కి పెరిగింది. ఢిల్లీలో కరోనా ఆంక్షలపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నేతృత్వంలోని DDMA తుది నిర్ణయం తీసుకోనుంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP ప్రభుత్వం జనవరి 27, ఫిబ్రవరి 4న వారాంతపు లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది.

పాఠశాలలు, జిమ్‌లు, సినిమా హాళ్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. వీటిపై అమల్లో ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి సమయంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చాయి. ఇప్పడా నష్టాల నుంచి లాభాలు పొందేందుకు వీలుగా ఢిల్లీలో ఆంక్షలను సడలించాలని వ్యాపారుల సంఘం ప్రభుత్వానికి లేఖలు రాసింది. న్యూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతుల్ భార్గవ మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రస్తుతం విధించిన ఆంక్షల సమయాన్ని రాత్రి 8 గంటలకు బదులుగా కనీసం 9.30 గంటల వరకు తెరిచి ఉంచాలని కోరారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నియంత్రించడానికి ఈ ఆంక్షలతో పెద్దగా ప్రయోజనం ఉండదనే ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత తగ్గిపోయిన సమయంలో కరోనా ఆంక్షలను కూడా ఎత్తివేయడం ద్వారా ఆర్థికంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Delhi Coronavirus Cases : ఢిల్లీలో కరోనా కంట్రోల్ లోకి..కొత్తగా 124 కేసులు

ట్రెండింగ్ వార్తలు