ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తమ హక్కులు కాపాడాలంటూ సీజేఐకి యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు లేఖ రాశారు.

Delhi Student writes Chief Justice On Coaching Centre Deaths

Delhi  Coaching Centre Tragedy: ఢిల్లీ రాజేంద్రనగర్‌లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్ దూబే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విద్యార్థులు చదువుకునేందుకు సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకునేలా చూడాలని కోరారు. ఢిల్లీ మున్సిపాలిటీ అధికారుల ఉదాసీనత కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్, ముఖర్జీనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోతుందని, ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీటిలో నడవాల్సి వస్తోందని, విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదని రాజేంద్రనగర్ ఘటన రుజువు చేసిందని తెలిపారు.

బుల్డొజర్లతో కూల్చివేత
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ విషాద ఘటనలో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 13 కోచింగ్ సెంటర్లలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని బేస్మెంట్‌లో ఉన్న లైబ్రరీ రూమ్స్‌ను ఏంసీడీ అధికారులు సీజ్ చేశారు. కోచింగ్ సెంటర్ల ముందు అక్రమ నిర్మాణాలను బుల్డొజర్లతో కూల్చివేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ భరోసా
ఓల్డ్ రాజేంద్రనగర్ రావుస్ ఐఏఎస్ అకాడమీలో జరిగిన ఘటన స్థలాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా స్వయంగా పరిశీలించారు. రావుస్ కోచింగ్ సెంటర్ వద్ద నిరసన తెలువుతున్న యూపీఎస్సీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు విద్యార్థుల మరణానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మేయర్ అత్యవసర భేటీ
ఓల్డ్ రాజేంద్రనగర్ దుర్ఘటన నేపథ్యంలో ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ సోమవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎంసీడీ కమిషనర్, ఢిల్లీ జల్ బోర్డు సీఈఓ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌‌లో ముగ్గురు విద్యార్థుల మృతి ఘటన.. బయటికొచ్చిన మరో వీడియో

ఆప్, బీజేపీ ఆందోళన
ఓల్డ్ రాజేంద్రనగర్ రావుస్ ఐఏఎస్ అకాడమీలో దుర్ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలని డిమాండ్ చేశారు.

కొనసాగుతున్న దర్యాప్తు
రాజేంద్రనగర్ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రావుస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ట్రెండింగ్ వార్తలు