Delhi Usa Bound Airindia Plane Returns Delhi Airport After Bat Entered Into Flight Cabin
Bat in Air india plane : గబ్బిలం. నిశాచరి అయిన ఆ జీవి పేరు వింటేనే ప్రపంచమంతా హడలెత్తిపోతోంది. కారణం ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఈ గబ్బిలాల నుంచే వచ్చిందని. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఓ విమానంలో గబ్బిలం కలకలం సృష్టించింది. దీంతో విమానంలోని సిబ్బందితో సహా ప్రయాణీకులంతా హడలెత్తిపోయారు. ఈ భయాందోళనలతో విమాన సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడి..విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి ల్యాండ్ చేశారు. గురువారం విమానం క్యాబిన్ లో గబ్బిలం స్వైరవిహారం చేయడంతో ఢిల్లీకి తిరుగుముఖం పట్టటంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందిపడ్డారు.
ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే క్యాబిన్లో గబ్బిలం కనిపించటంతో సిబ్బంది కూడా హడలిపోయారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం వారి సూచనల మేరకు తిరిగుముఖంపట్టారు.
ఢిల్లీలో టేకాఫ్ తీసుకున్న 30 నిమిషాలకే ఎయిరిండియా బోయింగ్ 737 విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగొచ్చింది. అనంతరం ప్రయాణీకులను కిందకు దింపివేసి..గబ్బిలంపై వన్యప్రాణి విభాగం వారికి సమాచారం అందించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న వన్యప్రాణి డిపార్ట మెంట్ సిబ్బింది విమానం క్యాబిన్ ను పరిశీలించారు. కానీ అప్పటికే ఆ గబ్బిలం బిజినెస్ క్లాస్ క్యాబిన్లో చచ్చిపోయిపడి ఉంది. దాన్ని అక్కడ నుంచి తొలగించి విమానాన్ని శానిటైజ్ చేసి.. ప్రయాణికులను మరో విమానంలో అమెరికా పంపించారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ..విమానంలో గబ్బిలాల వంటి సరీసృపాలు ప్రవేశించడం సాధారణమైన విషయమేనని..క్యాటరింగ్ వంటి ఇతర సర్వీసుల ద్వారా అవి విమానంలోకి వస్తుంటాయని తెలిపారు. కానీ ఈకరోనా కాలంలో గబ్బిలాన్ని చూసిన సిబ్బందితో సహా ప్రయాణీకులు కాస్త భయపడ్డారని కానీ కాస్త ఇబ్బంది అయినా ప్రయాణీకులకు మరో విమానంలో పంపించామని తెలిపారు.