Delta Plus In India 51 Cases Steps Taken All About The Covid Variant
Delta Plus Variant ALERT! కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభుత్వ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్.. ఇప్పుడు దేశంలోని 12 రాష్ట్రాలకు చేరుకోగా.. దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించి 51 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ వేరియంట్ గురించి పెద్దగా సమాచారం లేకపోవడంతో, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు నిపుణులు.
అందువల్ల, దాని వ్యాప్తిని ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.
ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు వచ్చాయి?
డెల్టా ప్లస్ వేరియంట్‌తో బాధపడుతున్న 51 మంది రోగులు ఇప్పటివరకు దేశంలో కనుగొనబడ్డారు. మహారాష్ట్రలో గరిష్టంగా 22 కేసులు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు డెల్టా ప్లస్ వల్ల మరణించారు. ఇవే కాకుండా, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు, కేరళలో ముగ్గురు, పంజాబ్, గుజరాత్‌లో ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, కర్ణాటకలలో ఒక్కొక్కరు డెల్టా ప్లస్ బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు కనుగొనబడ్డాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ మరియు హర్యానా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ ప్రభావం ఉందని, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లేఖ రాసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని ఆపాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లను ఇప్పటికే కోరింది.
వాస్తవానికి ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రకం డెల్టా ప్లస్ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. కొవిడ్-19 టీకాలు తీసుకోనివారిలో డెల్టా ప్లస్ శరవేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా రకాన్ని గుర్తించగా.. ఇది దేశంలో మూడో వేవ్‌కు కారణం కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఈ వేరియంట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.