పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. సోమవారం(ఫిబ్రవరి-18,2019) అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. దట్టమైన పొంగమంచు కారణంగా రైలు ఆలస్యంగా వారణాశి చేరుకొందని ప్రయాణికుల క్షేమం దృష్ట్యా రైలును తక్కువ వేగంతో నడిపించినట్లు ఉత్తర రైల్వే అధికారి దీపక్ కుమార్ తెలిపారు. పొగమంచు తగ్గిన తర్వాత రైలుని గంటకు 130కి.మీ వేగంతో నడిపినట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం బయల్దేరిన రైలు వారణాశికి మధ్యాహ్నాం 2గంటలకు చేరుకోవాల్సి ఉండగా,85 నిమిషాల ఆలస్యంతో మధ్యాహ్నాం 3:25గంటలకు చేరుకొంది. ఢిల్లీకి తిరిగి ప్రయాణం కూడా నిర్దేశిత సమయానికి కొనసాగలేదు. వారణాశి నుంచి 4:25గంటలకు బయల్దేరింది. 1:48గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంది.