Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్‌గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ప్రజలందరు కూడా ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవాలని గత నెలలో ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే, కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేతాజీ కుటుంబసభ్యులు,తృణముల్ కాంగ్రెస్ పార్టీ,వామపక్ష పార్టీలు మంగళవారం తీవ్రంగా స్పందించాయి. నేతాజీ జయంతి విషయంలో తాము ప్రతిపాదించిన పేర్లు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. జనవరి-23ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని.. నేజాజీ జయంతిని దేశ్ నాయక్ వివస్ గా జరపాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తోందని..ఇదే సరిపోయే పేరు అని ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ నేతాజీని దేశ్ నాయఖ్(జాతీయ హీరో)అని పిలిచేవారని..కానీ మోడీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటోందని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ విమర్శించారు.
నేతాజీ జయంతిని “దేశ్ ప్రేమ్ దివస్” గా జరపాలని ఆయన మనుమవడు,బీజేపీ నేత చంద్రకుమార్ బోస్ అన్నారు. కులాలకు,మతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ జనవరి-23ని దేశ్ ప్రేమ్ దివస్ గా జరుపుకోవాలని చంద్రకుమార్ బోస్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ స్పాన్సర్ షిప్ అవసరం లేదని అన్నారు. ఏదేమైనా భారతప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సిన సమయమిదని ఆయన తన ట్వీట్ లో నరేంద్రమోడీని,పీఎంవో ఇండియాని ట్యాగ్ చేశారు.
జనవరి 23,1897న ఒడిశాలోని కటక్‌లో జన్మించిన నేతాజీ..భారత స్వాతంత్రసంగ్రామంలో కీలకపాత్ర పోషించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటీషర్లపై పోరాడారు. అయితే ఆయన మరణంపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. 1945, ఆగస్ట్ 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని 2017లో ఓ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.