Kumbh Mela 2021: Shahi Snan today with Covid-19 norms in place
Haridwar Kumbha Mela : హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు వెల్లువలా తరలిరావడంతో…కరోనా నిబంధనలు అమలు చేసే వీలులేక పోలీసులు చేతులెత్తేశారు. గంగానదీ పరివాహక ప్రాంతాలన్నీ భక్తజనసంద్రంగా మారాయి. తెల్లవారుజామునుంచే ఘాట్‌ల దగ్గర భక్తులు కిటకిటలాడారు. ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక దూరం నిబంధన పాటించడం కష్టసాధ్యమని కుంభమేళా ఐజీ సంజయ్ గుంజయాల్ అంగీకరించారు.
కుంభమేళాలో భాగంగా మూడు రోజులు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని షాహి స్నాన్‌గా పిలుస్తారు. మార్చి 11న మొదటిది జరగ్గా, ఇవాళ రెండో షాహి స్నాన్ జరుగుతోంది, ఈ నెల 14న మూడోది జరగనుంది. ఇవాళ హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ గంగా నది భక్త జన ప్రవాహంగా మారింది.
పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామని ఐజీ సంజయ్ తెలిపారు. అయితే భక్తులు భారీగా తరలిరావడంతో అది సాధ్యం కావడం లేదని ఘాట్ల దగ్గర భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రస్తుత తరుణంలో చలాన్లు విధించే వీలు కూడా లేదన్నారు.
ఘాట్ల దగ్గర భక్తులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటే తొక్కిసలాట జరిగే ప్రమాదముందన్నారు. అందుకే ఈ నిబంధన పాటించాలని ఒత్తిడి చేయడం లేదన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో కరోనా రోజువారీ కేసులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. కుంభమేళా పుణ్యస్నానాల కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.