సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఒడిషా,బెంగాల్ లో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ ఇప్పుడు రాజకీయ ప్రచారస్త్రంగా మారింది.ఫొని తుఫాన్ విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు.
ఫొని తుఫాన్ సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసి ఇవాళ(మే-6,2019) ఉదయం ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వెస్ట్ బెంగాల్ లోని తమ్లుక్ సిటీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా మమతపై మోడీ తీవ్రమైన విమర్శలు చేశారు.ఫొని తుఫాన్ విషయంలో కూడా మమత రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని మోడీ ఆరోపించారు.ఫొని తుఫాన్ వచ్చే ముందు తాను మమతతో మాట్లాడేందుకు ప్రయత్నించానని,కానీ ఆమె తన అహంకార ధోరణిని ప్రదర్శించి తనతో మాట్లాడేందుకు నిరాకరించిందని మోడీ ఆరోపించారు.ర్యాలీ అనంతరం మోడీ ఓ ట్వీట్ లో….మమత నాకు ఫోన్ చేస్తుందని ఎదురుచూశాను.కానీ ఆమె ఫోన్ చెయ్యలేదు.ఆమెకు మళ్లీ ఫోన్ చేశాను.నేను బెంగాల్ ప్రజల గురించి బాధలో ఉండి మమతతో మాట్లాడాలని ఆమెకు మళ్లీ ఫోన్ చేసినప్పటికీ రెండోసారి కూడా మమత నాతో మాట్లాడలేదు అని మోడీ తెలిపారు.
ఫొని తుఫాన్ పై రివ్యూ మీటింగ్ సాధ్యాసాధ్యాలపై బెంగాల్ ప్రభుత్వాన్ని తాము అడగినప్పటికీ రాష్ట్ర అధికారులు దానికి తిరస్కరించారని,తాము ఎన్నికల క్యాంపెయినింగ్ లో బిజీగా ఉన్నట్లు చెప్పారని ప్రధాని మంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.