Digvijaya Singh : వారి సాయం మర్చిపోలేను..అమిత్ షా,ఆర్ఎస్ఎస్ పై దిగ్విజయ్ ప్రశంసలు

అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరుగుతూ ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లుండి ఆర్ఎస్ఎస్,అమిత్ షాపై ప్రశంసల వర్షం

Digvizay

Digvijaya Singh అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరుగుతూ ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లుండి ఆర్ఎస్ఎస్,అమిత్ షాపై ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగేళ్ల క్రితం తన ‘నర్మద పరిక్రమ’ (తీర్థయాత్ర) సందర్భంగా అమిత్ షా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా సహాయం చేశారో  చెప్పారు. దిగ్విజయ్ సింగ్ 2017లో తన భార్య అమృతతో కలిసి 3 వేల కిలోమీటర్ల ‘నర్మద పరిక్రమ’ యాత్రను ప్రారంభించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలోని బర్మన్ ఘాట్ నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు నెలలపాటు కొనసాగిన విషయం తెలిసిందే.

గురువారం దిగ్విజయ్ సింగ్ తన దీర్ఘకాల సహచరుడు ఓపీ శర్మ రాసిన ‘నర్మద పాఠిక్’ పుస్తకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో మేం గుజరాత్‌లోని మా గమ్యస్థానికి చేరుకున్నాం. అది అటవీ ప్రాంతం కావడంతో ముందుకెళ్లే దారిలేదు. రాత్రిపూట బస చేయడానికి ఎలాంటి సదుపాయం లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో మేం ఆలోచిస్తున్న సమయంలో ఓ అటవీ సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతను నాతో చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అతడు నాతో అమిత్ షా మీకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ పంపారని చెప్పారు.

అప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. నేను వారికి పెద్ద విమర్శకుడిని. అయినప్పటికీ యాత్రలో మేం ఎలాంటి ఇబ్బంది పడకూడదని అమిత్ షా చూశారు. పర్వతాల మీదుగా మాకు దారి చూపెట్టబడింది. అంతేకాదు, మా అందరికీ ఆహారం సమకూర్చారు అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజకీయ సమన్వయం, సర్దుబాటు, స్నేహానికి రాజకీయాలు, భావజాలంతో సంబంధం లేదని చెప్పడానికి ఇది ఒక ఊదాహరణ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే ఈ రోజు వరకు తాను అమిత్ షాను కలవలేదని చెప్పిన దిగ్విజయ్ సింగ్.. ఆయనకు కొన్ని మార్గాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ALSO READ  సంప్రదాయ నృత్యంతో అదరగొట్టిన కిరణ్ రిజిజు..మొచ్చుకున్న మోదీ

ఇక, ఆర్ఎస్ఎస్ ని తాను తీవ్రంగా విమర్శించినప్పటికీ.. తన యాత్రలో సంఘ్ కార్యకర్తలు తనను కలుస్తూనే ఉండేవారని చెప్పారు. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారని తాను వారిని అడిగానని.. అప్పుడు వారు మిమ్మల్ని కలవమని ఆదేశాలు ఉన్నాయి అని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తాము భరూచ్ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ బృందానికి మాంఝీ సమాజ్ ధర్మశాలలో ఒక రోజు విడిది ఏర్పాటు చేశారని, తాము బస చేసిన గదిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు  కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవరావ్ సదాశివరావ్ గోల్వాల్కర్ తదితరుల ఫొటోలు ఉండేవని దిగ్విజయ్ గుర్తు చేసుకున్నారు. బీజేపీ యువజన విభాగం నాయకుడు, మరో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు నాయకులు నా సముహంలో ఉన్నారు. వారిది నా నర్మద కుటుంబం నుంచి విడదీయరాని బంధం అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తన తీర్థయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి సాయం తీసుకున్నానని వివరించారు కాబట్టి రాజకీయాలు, మతాలు వేర్వేరన్న విషయం ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అయితే అమిత్ షా,ఆర్ఎస్ఎస్ పై సడన్ గా దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.