పాక్ గూఢచార సంస్థ నుంచి బీజేపీకి డబ్బులు

కాంగ్రెస్ సీనియర్ లీడర్,మధ్యప్రదేశ్ మాజీ సీఎం  దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI నుంచి భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నేతలు డబ్బులు తీసుకుంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టిసారించాలని కోరారు. ముస్లింల కంటే ముస్లిమేతరులు ISI తరపున గూఢచారులుగా పనిచేస్తున్నారని డిగ్గీ రాజా ఆరోపించారు. ఈ విషయం అందరికీ అర్థం కావాల్సి ఉందన్నారు. టెర్రర్ ఫండింగ్‌ కేసు కింద భజరంగ్‌ దళ్‌ నేత బలరాం సింగ్‌ సహా ఐదుగురు వ్యక్తులను ఆగస్టు 21 ఎటీఎస్‌ అరెస్టు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా డిగ్గీ రాజా ప్రస్తావించారు.  

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. వార్తల్లో ఉండేందుకే దిగ్విజయ్ వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులందరూ పాక్ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ-ఆరెస్సెస్ దేశభక్తి ప్రపంచానికంతటికీ తెలుసున్నారు చౌహాన్.

దిగ్విజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. దిగ్విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోడీపై ద్వేషంతో పాక్ కు ఆక్సిజన్ ఇచ్చే వ్యాఖ్యలను కాంగ్రెస్ చేస్తోందని సంబిత్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే బీజేపీపై డిగ్గీ రాజా ఈ తరహా ఆరోపణలు, విమర్శలు గుప్పించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.