పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్

పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వాయుసేన జరిపిన మెరుపుదాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని, భారతప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయని దిగ్విజయ్ వరుస ట్వీట్ లు చేశారు. బాలాకోట్ మెరుపుదాడులపై ప్రధాని మోడీ మాట్లాడాలని, ఎవరు అబద్దాలు చెబుతున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.
Also Read : గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్

బాలాకోట్ లో చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించి బీజేపీ చీఫ్ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా చేసిన ప్రకటనలపై కూడా మోడీ సమాధానం చెప్పాలని అన్నారు. యోగి 400మంది చనిపోయారని,అమిత్ షా 250మంది చనిపోయారని, ఒక్కరు కూడా చనిపోలేదని అహ్లువాలియా చెబుతున్నారని, మోడీ మాత్రం ఈ ప్రకటనలపై నోరు విప్పడం లేదన్నారు.

ఇక్కడ ఎవరు అబద్దాలు చెబుతున్నారో దేశానికి తెలియాలని అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ నిర్వహించిన వారిని  మోడీ, క్యాబినెట్ మంత్రులు అవమానపరుస్తున్నారని అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ ని బీజేపీ తన విజయంగా చెప్పుకుంటుందని, ఇది మన ధైర్యవంతులైన జవాన్లను అవమానపర్చడమేనని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు ఆర్మీని, భధ్రతాబలగాలను గౌరవిస్తాడని చెప్పారు.
Also Read : ఇండిగో ‘రన్‌వే సేల్’ ఆఫర్ : రూ.899లకే విమాన టికెట్

అంతేకాకుండా మోడీ సర్కార్ పై తీవ్రవిమర్శలు చేసిన ఆయన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఉగ్రదాడిని ఓ యాక్సిడెంట్ గా అభివర్ణించారు. మన భద్రతా బలగాలపై తమకు పూర్తి విశ్వాసముందని, ధైర్యవంతులైన మన జవాన్లు చూసి గర్వపడుతున్నామని అన్నారు. తన మిత్రులు,బంధువులు అనేకమంది ఫ్యామిలీలను సైతం వదిలి సైన్యంలో మనందరి రక్షణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. 

పుల్వామా ఉగ్రదాడిని యాక్సిడెంట్ గా అభివర్ణించడంపై సోషల్ మీడియా వేదికగా దిగ్విజయ్ సింగ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈయనకి వయసు అయిపోయి మతిస్థిమితం కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నాడని, మెంటల్ హాస్పిటల్ లో డిగ్గీ రాజాను చేర్పించాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Also Read : ఇది కొంచెం ఢిఫరెంట్… బీర్ బాత్ టబ్ ఛాలెంజ్ చూశారా?

పుల్వామా ఉగ్రదాడిని దిగ్విజయ్ సింగ్ యాక్సిడెంట్ అనడంపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు అసలు ఏమైంది అని ప్రశ్నించారు కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్. భారత సాయుధ బలగాల సమాచారాన్ని తిరస్కరిస్తూ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్ నేతలు ఆటలాడుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఈ విధంగా జరగదని, ఎక్కడైనా ప్రజలు తమ దేశ ఆర్మీని నమ్మకుండా ఉండరని జావదేకర్ తెలిపారు. బాలాకోట్ లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో తెలియాలంటే బాలాకోట్ కి వెళ్లి చెక్ చెయ్యాలని రాజ్యవర్థన్ రాథోడ్ అన్నారు.