CAA అమలు చేయం : ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసుకోవచ్చు

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరకేంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇవాళ(డిసెంబర్-16,2019)రాజధాని కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోస్టర్లు జెండాలు పట్టుకుని మమత వెంట నడిచారు. రెడ్ రోడ్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాం నుంచి జొరాసంకో థాకూర్బారి వరకు ర్యాలీ జరిగింది. 

పౌరసత్వ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఈ సందర్భంగా మమత తేల్చి చెప్పారు. ఈ చట్టాన్ని అమలుచేయని తృణముల్ ప్రభుత్వాన్నికేంద్రం రద్దు చేయాలనుకుంటే చేసుకోవచ్చని మమత సవాల్‌ విసిరారు. కోల్ కతాలోని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసం జొరాసంకో దగ్గర్లో ఏర్పాటు చేసిన స్టేజీపై మమత మాట్లాడుతూ…మమత ఒంటరిగా ఉందని వాళ్లు అనుకుంటున్నారు,కానీ ఇప్పుడు చాలా మంది నాతో ఉన్నారు. మీ కారణం సరైనది అయితే ప్రజలు మద్దతుగా ఉంటారు.ఏక్లా చలో రే నినాదాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఇది మతఆధారిత ఫైట్ కాదని మమత అన్నారు. డివైడ్ & రూల్ పాలసీ ఎందుకు ఉంటుంది? ఎందుకు ద్వేషం ఉంటుంది? నేను ద్వేషపూరిత రాజకీయాల ముందు నేను తలవంచను. ద్వేషపూరిత రాజకీయాలను విశ్వసించే వ్యక్తులు బయటకు వెళ్తారని నాకు నమ్మకం ఉంది. ఈ దేశాన్ని ప్రేమించే ప్రజలు మేము ఇక్కడే ఉంటాము అని మమత అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ, మంత్రులు నిరసన ర్యాలీ చేపట్టడాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధనకర్ తప్పుబట్టారు. గత మూడు రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని అదుపులోనికి తీసుకురావాల్సింది పోయి నిరసన ర్యాలీకి పిలుపునిస్తారా? ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని గవర్నర్ ట్వీట్ చేశారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తనకు తెలియజేసేందుకు మంగళవారం ఉదయం రాజ్ భవన్ కి రావాలని మమతకు ఫోన్ చేసినట్లు ఆయన తెలిపారు.