యడియూరప్ప వెయ్యి కోట్లు ఇచ్చాడు… జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం యడియూరప్ప తనకు రూ.1,000కోట్లు ఇచ్చాడంటూ అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బులను తాను తన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు నారాయణ తెలిపారు. 

మంగళవారం(నవంబర్-5,2019)తన మద్దతుదారులను ఉద్దేశించి నారాయణ గౌడ మాట్లాడుతూ…కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే కొన్ని రోజుల ముందు ఓ వ్యక్తి నన్ను యడియూరప్ప ఇంటికి ఉదయం 5గంటల సమయంలో తీసుకెళ్లాడు. మేము ఆయన ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో యడియూరప్ప పూజగదిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన మా దగ్గరకి వచ్చి కూర్చోమన్నారు. నేను మరోసారి సీఎం అయ్యేందుకు నువ్వు మద్దతు ఇవ్వాలి అని యడియూరప్ప అడిగారు. క్రిష్ణరాజపేట నియోజకవర్గ అభివృద్ధికి 700కోట్లు కేటాయించాలని అడిగాను. ఆ తర్వాత ఆయన వెయ్యి కోట్లు ఇచ్చాడు. నా నియోజకవర్గానికి ఇంత సహకారం అందించిన వ్యక్తికి సపోర్ట్ చేయాలనిపించింది. మద్దతు ప్రకటించాను.

అయితే ఆ తర్వాత అనర్హత ఎమ్మెల్యేలతో మాకు ఎలాంటి సంబంధం లేదని యడియరప్ప అన్నారని నారాయణ గౌడ తెలిపారు. అనర్హత వేటు పడిన జేడీఎస్ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే యడియూరప్పకు మద్దతు ప్రకటించానని మండ్యాలో ఓ ప్రకటన చేశారని నారాయణ గౌడ తెలిపారు.