Diwali festival ban on crackers : దీపావళి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్లలో సందడి నెలకొంటోంది. ఈ పండుగ అనగానే..దీపాలతో పాటు రాత్రి వేళ కాల్చే క్రాకర్స్ గుర్తొస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..బాణాసంచాను కాలుస్తుంటారు. పటాకులను కాల్చడం వల్ల కాలుష్యం వెదజల్లుతుందని, పొల్యూషన్ లేని క్రాకర్స్ కాల్చాలని ఎంతమంది మొత్తుకున్నా..కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఫలితంగా దీపావళి పండుగ రోజున..అధిక కాలుష్యం రికార్డవుతుంది. ఇంతకుముందున్న రోజులు ఇప్పుడు లేవు. కరోనా నాట్యమాడుతోంది. కాలుష్యం బారిన పడిన వారి ఆరోగ్యం మరింత క్లిష్టమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో దేశంలోని పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. బాణాసంచాపై నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి.
కాలుష్యం అనగానే..మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాష్ట్రం దేశ రాజధాని ఢిల్లీ. చలికాలం స్టార్ట్ కాగానే..భారీస్థాయిలో కాలుష్యం వెదజల్లుతుంటుంది. ఊపిరి పీల్చుకోవడానికే ప్రజలు అష్టకష్టాలు పడుతుంటారు. ఢిల్లీలో కాలుష్యానికి వాహన కాలుష్యం 60 శాతం వరకు కారణమైతే, పొలాల నుంచి వచ్చే పొగ 20 శాతం వరకు ఉంటోందని అంచనా. ప్రస్తుతం కరోనా ఆ రాష్ట్రంలో ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బాణాసంచాపై నిషేధం విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 07వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఎవరైనా బాణాసంచా కాల్చితే కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు.
ఇప్పటికే ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు బాణసంచా విక్రయాలపై నిషేధం విధించాయి కూడా. హర్యాణ రాష్ట్రం పాక్షికంగా నిషేధం విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం టపాసులు కాల్చొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లోనే దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని సూచించింది. టపాసులు కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం తీవ్రమవుతోందని పర్యావరణ వేత్తలు వెల్లడిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల భారత్ లో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల గాలి నాణ్యత సూచి అధికమౌతోంది. గాలి నాణ్యత సూచి (AQI) 0 నుంచి 100 శాతం వరకు ఉంటేనే…ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. దీపావళి పండుగ తర్వాత…సాధారణ పరిస్థితి రావడానికి కొన్ని రోజులు పడుతుంటుంది. కోట్లాది రూపాయలు బాణాసంచాకు వెచ్చిస్తుంటారు.
బాణాసంచా తయారీలో సల్ఫర్, మెగ్నీషియం, నైట్రేట్, జింక్, కాపర్, కాడ్మియం, సీసం వంటి రసాయన, లోహ కారకాలు వినియోగిస్తుంటారు. వీటిని కాల్చడం వల్ల..కాలుష్య వాయువులు ప్రబలుతాయి. అనేక మందికి శ్వాస, కిడ్నీ, నాడీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి.