కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన డీకే శివకుమార్

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను బుధవారం(మార్చి-11,2020) కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మంగళవారం మాజీ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు దినేష్ గుండురావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తిరిగి రాహుల్ గాంధీ చేపట్టాలని,పార్టీ వ్యవహారాలను చూడాలని గుండురావ్ డిమాండ్ చేశారు. 

మంగళవారం దినేష్ గుండురావు అనంతరం ఇవాళ కేపీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈశ్వర్ కండ్రే,సతీష్ జార్ఖిహోలి,సలీమ్ అహ్మద్ లు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. మరోవైపు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనీల్ చౌదరిని నియమించింది కాంగ్రెస్.

కొత్తగా కేపీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శివకుమార్ మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభంపై స్పందించారు. కాంగ్రెస్ ను ఎవరూ నాశనం చేయలేరన్నారు. నాయకులు వస్తుంటారు,పోతుంటారని,అదేమీ పెద్ద విషయమేమీ కాదన్నారు. బెంగళూరులో ఉన్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. వాళ్లు ఇది అర్థం చేసుకుని తిరిగి మధ్యప్రేదేశ్ వెళ్లి కమల్ నాథ్ సర్కార్ ను సేవ్ చేస్తారని తనకు నమ్మకముందని శివకుమార్ తెలిపారు. 

See Also | ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నయమైంది, ప్రపంచంలో రెండో వ్యక్తి