×
Ad

Dk Shivakumar: కర్ణాటకలో ముగిసిన సంక్షోభం.. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎం.. తేల్చేసిన డీకే శివకుమార్

డీకే వర్గం దీనికి ఒప్పుకుంటుందా? మళ్లీ అసంతృప్తి జ్వాలలు రగులుతాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Dk Shivakumar: కర్నాటక పవర్ షేరింగ్ గేమ్ కి తెరపడినట్లే కనిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం ముగిసినట్లే అనిపిస్తోంది. ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లు ముగుస్తుండగా కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కి సీఎం సీటు అప్పగించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఇదే క్రమంలో అటు సిద్ధరామయ్య, ఇటు డీకే వర్గం ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ కావటం ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఇంతలోనే ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించగా, ఆయనకు తామంతా సహకరిస్తామని డీకే శివకుమార్ తేల్చి చెప్పటంతో ఈ పొలిటికల్ డ్రామాకి తెరపడినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయిన సిద్ధరామయ్య క్యాబినెట్ విస్తరణ కోసం అధిష్టానం నుంచి అనుమతి కోరారు. దీని ద్వారా మరో ఏడాదిన్నర పాటు తన సీఎం సీటు సేఫ్ అని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావటంతో అధికార పంపిణీ జరగాల్సిందేనంటూ డీకే శివకుమార్ క్యాంప్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. సీఎం పదవికి డీకే శివకుమార్ అన్ని విధాలుగా అర్హుడని చెబుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలోనే డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ మరింత హీట్ పెంచింది.

ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. డీకే ట్వీట్ వెనుకున్న మర్మం ఏంటో అని అంతా చర్చించుకున్నారు. ఇంతలో సిద్ధరామయ్య అధిష్టానం పెద్దల దగ్గర ఈ పంచాయితీ తేల్చుకోవటం, వెంటనే డీకే క్లారిటీ ఇవ్వటంతో ఈ వివాదం ఇప్పటికి ముగిసినట్లుగానే కనిపిస్తోంది. అయితే, డీకే వర్గం దీనికి ఒప్పుకుంటుందా? మళ్లీ అసంతృప్తి జ్వాలలు రగులుతాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కర్నాటకలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ శ్రేణుల్లో హీట్ పెంచింది. ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడిన డీకే.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ పదవిలో శాశ్వతంగా ఉండలేను అని అనడం చర్చకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా పవర్ షేరింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. సిద్ధరామయ్య సీఎంగా రెండున్నరేళ్లు గడిచిపోయాయి, దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు డీకేకి అప్పగించాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని నాడు ఒప్పందం చేసుకున్నట్లు సమచారం. దీంతో నాయకత్వ మార్పుపై కొన్ని నెలలుగా విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో డీకే చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్‌ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు డీకే మద్దతుదారులు ఢిల్లీకి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. డీకేకు సీఎం పగ్గాలు అప్పజెప్పాలని వారు కోరారట. అయితే, పూర్తి ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని ముందు నుంచి సిద్ధరామయ్య తెగేసి చెబుతున్నారు. చివరికి ఆయన అనుకున్నట్లే జరిగిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Also Read: కుక్క కాటుతో చనిపోతే రూ.5లక్షలు.. గాయపడితే రూ.5వేలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ