Siddaramaiah: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సీఎం సిద్ధరామయ్య మంగళవారం మళ్లీ బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉన్నారని, ప్రభుత్వాన్ని కలిసి నడిపిస్తామని అన్నారు.
సీఎం పదవి అంశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రాజీ కుదిరిందని నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం కూడా వారిద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఇక తమ మధ్య ఉన్న వివాదాలు ముగిసినట్టేనని చెప్పారు. (Siddaramaiah)
ఇవాళ కూడా సీఎం సిద్ధరామయ్య రెండో బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు. మొదటి సమావేశంలో ఇడ్లీ-సాంబార్, ఉప్మా తిన్న ఇద్దరు.. ఈ సారి డీకే శివకుమార్ ఇంట్లో నాటుకోడి చికెన్, ఇడ్లీలు తిన్నారు.
అనంతరం సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నిస్తూ డీకే శివకుమార్ సీఎం అవుతారా? అని అడిగింది. దీనికి సిద్ధరామయ్య స్పందిస్తూ “హైకమాండ్ చెబితే అవుతారు” అని అన్నారు.
Also Read: మీ ఇంట్లో పట్టు చీర ఉందా.. దాని క్వాలిటీ ఎంతో చెక్ చేసుకోవచ్చు.. బంగారం టైప్‌లో..
హైకమాండ్‌తో కూడా సమావేశం ఉందని సిద్ధరామయ్య అన్నారు. “నేను, డీకే శివకుమార్ ఒకటే. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కలిసి నడిపిస్తాం. మా ఎమ్మెల్యేలు అందరూ ఒకటే.. కలిసి ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటాం. మాది ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, కలిసి పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇద్దరం కలిసి పనిచేసి పార్టీని తిరిగి అధికారాన్ని తీసుకువస్తాం” అని తెలిపారు.
“బ్రేక్‌ఫాస్ట్ తరువాత అసెంబ్లీ సెషన్ గురించి మాట్లాడాం. డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. రైతుల సమస్యలు, రాష్ట్ర సమస్యలపై చర్చిస్తాం. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి ఇద్దరం అంగీకరిస్తాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు ఢిల్లీకి రమ్మంటే వెళ్తాం. రేపు నేను, కేసీ వేణుగోపాల్‌ను ఒక కార్యక్రమంలో కలుస్తాను” అని చెప్పారు.