Tribunals​ మూసెయ్యాలనుకుంటున్నారా?..కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

 ట్రిబ్యునల్స్‌లో ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Cji2

Tribunals​ ట్రిబ్యునల్స్‌లో ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ట్రిబ్యునల్స్ లో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ట్రిబ్యునళ్లకు బ్యూరోక్రసీ అవసరం లేదా?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూటిగా ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్‌ నిర్వీర్యమయితే.. ట్రిబ్యునల్స్‌ అమలు చేసే చట్టపరమైన ప్రాంతాలపై హైకోర్టులకు అధికారం లేని సమయంలో న్యాయం కోసం ఫిర్యాదుదారులు ఎక్కడకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. మీరు ట్రిబ్యునల్స్‌ అవసరం లేదనుకుంటే.. వారి అధికార పరిధిని హైకోర్టులకు బదిలీ చేసేందుకు అనుమతించండి. లేదా ట్రిబ్యునల్స్‌ను కొనసాగించాలనుకుంటే ఖాళీలను భర్తీ చేయండి. న్యాయం పొందే ప్రజల హక్కును మీరు నిరాకరించలేరు అని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

కీలకమైన ట్రిబ్యునల్స్ లో ఉన్న 200 ఖాళీలకు పైగా వివరాలను ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ రమణ చదివి వినిపించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. 15కు పైగా ట్రిబ్యునళ్లకు ప్రిసైడింగ్‌ అధికారులు లేరని న్యాయస్థానం తెలిపింది. ఖాళీలను భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం ఎక్కువ శాతం తిరస్కరించిందని పేర్కొంది. ట్రిబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. ట్రిబ్యునల్స్ ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ సమయంలో ఈ విషయాన్ని తప్పక చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్​.వి. రమణ ఆదేశించారు. ట్రిబ్యునళ్ల ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఈ ఖాళీల భర్తీ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పది రోజుల్లో తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.