Sudha Murthy : సుధామూర్తి, నారాయణమూర్తి ప్రేమకథకు పునాది వేసింది పుస్తకాలేనట.. ఆ స్టోరీ ఏంటో తెలుసా?

సుధ-నారాయణమూర్తిల అందమైన ప్రేమ కథ అసలు ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందో మీకు తెలుసా? 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీరి పరిచయాన్ని సుధామూర్తి 'జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024' పంచుకున్నారు.

Sudha Murthy

Sudha Murthy : ప్రేమ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుడుతుంది? అంటే ఎవరూ చెప్పలేరు. ఎంతటి వారైనా దానికి అతీతులు కారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తిల ప్రేమ కథ కూడా అంతే. వారిద్దరు అసలు ఎలా కలిశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అంటే వారి అందమైన ప్రేమ కథ చదవండి.

 

Sudha Murthy 1

50 సంవత్సరాల తమ ప్రేమకథను సుధామూర్తి రీసెంట్‌గా జైపూర్‌లో జరిగిన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’ లో పంచుకున్నారు. ఇదే ఫెస్టివల్‌లో చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన వీరి బయోగ్రఫీ ‘యాన్ అన్ కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ పుస్తకం రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంలో సుధామూర్తి తమ అందమైన ప్రేమ కథను చెప్పారు. 1974 ప్రాంతంలో సుధ, నారాయణలు కలిశారట. అప్పుడు సుధ ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా పనిచేస్తున్నారట. ఆ సమయంలో తన కొలీగ్ ప్రసన్న పుస్తకాలు చదువుతూ ఉండేవారట. ఆ పుస్తకాలపై మూర్తి అనే పేరు చూసిన సుధ ‘ఎవరీ మూర్తి?’ అని ఆసక్తిగా అడిగారట. అందుకు ప్రసన్న ‘తను నా రూమ్మేట్.. పుస్తకాల పిచ్చి.. ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాడు.. నీకు అదే పిచ్చిగా నాతో రా పరిచయం చేస్తాను’ అన్నారట. ‘అమ్మో బ్యాచిలర్ రూమ్‌కా? .. నేను రాను’ అని జంకారట సుధ. మొత్తానికి ధైర్యం చేసి వారి రూమ్‌కి వెళ్లారట.

Sudha Murty : ప్రజల నుండి నెగెటివిటీ ఎదుర్కోవడంలో.. రిషి సునక్, అక్షతలకు సుధామూర్తి ఇచ్చే సలహా ఏంటంటే?

రూమ్‌కి వెళ్లేముందు నారాయణమూర్తి ఎలా ఉంటారో? అని తెగ ఊహించుకున్నారట సుధ. మందంగా ఉండే కళ్లద్దాలతో బక్క పలచగా నారాయణమూర్తి కనిపించారట. ఇక తన దగ్గర ఉన్న పుస్తకాలు అన్నీ చూపించారట. అలా మొదలైన వారి పరిచయంలో ఒక రోజు నారాయణమూర్తి ‘డిన్నర్ కి వస్తావా’ అని అడిగారట. ప్రసన్న లేకుండా రానని.. తన బిల్లు తాను కట్టుకుంటానని చెప్పి మరీ సుధ డిన్నర్‌కి వెళ్లారట. అలా వారి మధ్య మొదలైన స్నేహంలో ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధకు ప్రపోజ్ చేసారట. వెంటనే సుధ సరే అనడం.. నాలుగేళ్ల తర్వాత వారి పెళ్లైపోవడం జరిగిపోయిందట.

Sudha Murthy 2

అయితే ఇన్ఫోసిస్ మొదలైన తర్వాత సుధా మూర్తి అందులోకి రావడం నారాయణమూర్తికి అసలు ఇష్టం లేదట. అందుకే సుధామూర్తి 5 సంవత్సరాల పాటు పిల్లల బాగోగులు చూసుకుంటూ రచనలు చేసుకుంటూ ఇంటిపట్టున ఉండిపోయారట. తర్వాత కొంతకాలానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ సంతృప్తి చెందానని సుధామూర్తి చెబుతారు. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే నమ్మకం, సహనం, సర్దుబాటు ఎంతో అవసరమని చెప్పారు సుధామూర్తి. పెళ్లయ్యాక అనుకున్నవి చేసేంత స్వేచ్చ లేకపోయినా ఉన్నంతలో ఆనందాన్ని వెతుక్కోవాలని.. ముఖ్యంగా ఆడవాళ్లు అటు భర్త మాటను గౌరవిస్తూనే తాము అనుకున్నవి సాధించుకుంటూ ముందుకు సాగాలని సుధామూర్తి చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు