G20 Summit 2023: అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో ఆంక్షలు.. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో..

థియేటర్లు, రెస్టారెంట్లలోకి వెళ్లొచ్చా? సున్నిత ప్రాంతాలు ఏవి? న్యూ ఢిల్లీని వదిలి వెళ్లొచ్చా?

G20 Summit 2023

G20 Summit 2023 – New Delhi: జీ20 సదస్సు జరుగుతుండడంతో న్యూ ఢిల్లీ మొత్తం ప్రజలు ఎన్నడూ చూడని ప్రాంతంలా మారిపోయింది. ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో అక్కడ జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో న్యూ ఢిల్లీలో ఎన్నో ఏర్పాట్లు చేశారు.

జీ20 సదస్సు జరిగే ప్రతిగతి మైదాన్, భారత్ మండపం, అతిథులు బస చేసే హోటళ్లు, వారు తిరిగే ప్రదేశాల వద్ద చర్యలు తీసుకుంటున్నారు. అతిథుల భద్రతకు, వారి పర్యటన సాఫీగా సాగేందుకు ఎన్నో ఆంక్షలు విధించారు. ప్రగతి మైదాన్‌తో పాటు లుటియన్స్ ఢిల్లీలోని బంగ్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రభుత్వ భవనాలు అన్నీ నియంత్రిత జోన్‌లోకి వెళ్లనున్నాయి.

ఆంక్షలు ఎన్ని రోజులు?
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేటి అర్ధరాత్రి నుంచి సెప్టెంబరు 10 అర్ధరాత్రి వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.

న్యూ ఢిల్లీ వాసులు ప్రయాణాలు చేయొచ్చా?
న్యూ ఢిల్లీలో ఉండేవారు ప్రయాణాలు చేయొచ్చు. అయితే, నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారి వద్ద ప్రత్యేక పాసులు ఉండాల్సిందే.

శని, ఆదివారాల్లో త్రీ సీటర్ ఆటోలు, ట్యాక్సీలు న్యూ ఢిల్లీలో శనివారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 11.59 గంటల వరకు తిరగడానికి వీల్లేదు.

మథుర రోడ్‌లో గూడ్స్, వాణిజ్య వాహనాలు, అంతర్రాష్ట్ర బస్సులు, లోకల్ సిటీ బస్సులు ఇవాళ అర్ధరాత్రి నుంచి సెప్టెంబరు 11.59 గంటల వరకు బైరాన్ రోడ్, పురానా క్విలా రోడ్ తో పాటు ప్రగతి మైదాన్ టన్నెల్ లోపలి నుంచి వెళ్లడానికి అనుమతులు ఉండవు.

ఇప్పటికే హోటళ్ల బుకింగులు చేసుకుని అనుమతులు తీసుకున్న పర్యాటకులు, స్థానికులు న్యూ ఢిల్లీలో తిరగవచ్చు. స్థానికులు, అత్యవసర సేవల సిబ్బంది ఐడీ కార్డులను దగ్గర పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. న్యూ ఢిల్లీలోకి సీటీ బస్సులను అనుమతించరు.

థియేటర్లు, రెస్టారెంట్లలోకి వెళ్లొచ్చా?
న్యూ ఢిల్లీలో సెప్టెంబరు 8 నుంచి అన్ని కార్యాలయాలు, థియేటర్లు, రెస్టారెంట్లు, మాల్స్ మూసి ఉంటాయి.

సున్నిత ప్రాంతాలు ఏవి?
ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జనపథ్, భికాజీ కామా ప్రాంతాలను పోలీసులు సున్నిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల నియంత్రణలో ఇవి ఉంటాయి.

మార్నింగ్ వాక్ చేయొచ్చా?
నియంత్రిత జోన్ లోకి కార్లు, సైకిళ్లు, ఇతర వాహనాలను అనుమతించబోమని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. శని, ఆదివారాల్లో మార్నింగ్ వాక్ కు కూడా వెళ్లవద్దని నగర వాసులను కోరారు.

ఫుడ్ డెలివరీ సర్వీసులు ఉంటాయా?
క్లౌడ్ కిచెన్‌, ఫుడ్ డెలివరీ సర్వీసులు, ఇతర డెలివరీ సేవలు శని, ఆదివారాల్లో ఉండవు.

న్యూ ఢిల్లీని వదిలి వెళ్లొచ్చా?
న్యూ ఢిల్లీలో నివసించే వారు నగరం నుంచి వెళ్లొచ్చు రావచ్చు. బయటి వారు న్యూ ఢిల్లీకి రావాలంటేనే ప్రత్యేక పాసులు ఉండాలి. న్యూ ఢిల్లీ బయటకు వెళ్లేవారు మెట్రో రైలు సేవలను వాడుకోవాలని పోలీసులు సూచించారు. సొంత వాహనాలపై వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.

G20 Summit 2023 : జీ20 దేశాధినేతలకు బంగారు పాత్రల్లో విందు.. భారత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత!