చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. దేశంలో ఇదే తొలి కరోనా మరణం. అయితే ఇప్పుడు ఆ వృద్ధుడికి ట్రీట్మెంట్ చేసిన 64ఏళ్ల డాక్టర్ కు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.
మార్చి-6నుంచి మార్చి-9వరకు కలబుర్గి లో పెషెంట్ కు ఆయన నివాసంలో ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ కు కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని కలబుర్గి డిప్యూటీ కమిషనర్ శరత్ తెలిపారు. కలబుర్గి వ్యక్తి మరణించిన తర్వాతనే ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ అయిన విషయం తెలిసిందే.
See Also | ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు
కరోనా సోకిన డాక్టర్ ను,ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్(దిగ్భందం)చేశారు. డాక్టర్ కలిసిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నట్లు కలబుర్గి డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇవాళ కరోనా సోకిన డాక్టర్ ను ఐసొలేషన్ వార్డుకి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 10కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.