Doctors Prescriptions: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ప్రిస్క్రిప్షన్ అస్సలు అర్థం కాదు. ఆ డాక్టర్ అందులో ఏం రాశారో ఆయనకు తప్ప మరెవరికీ అర్థమే కాదు. ఏదో కోడి గీసినట్లు ఆ రాతలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుందామని ఎంత ట్రై చేసినా, జుట్టు పీక్కున్నా అది మనకు అర్థం కానే కాదు. మనలో చాలా మంది ఈ ఎక్స్ పీరియన్స్ ని ఫేస్ చేసి ఉంటారు. అయితే ఇకపై ఇలాంటి బాధ తప్పనుంది. ఎందుకంటే.. ఇకపై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ను ఎలా పడితే అలా కాకుండా అందరికీ అర్ధమయ్యే విధంగా, స్పష్టంగా రాయాల్సిందేనని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
డాక్టర్ల చేతి రాతలను చదవలేని వారందరికీ ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్ ప్రాథమిక హక్కు అని పంజాబ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే అది జీవితానికి, మరణానికి మధ్య తేడాను కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. డాక్టర్లు తమ చేతి రాత స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని కోర్టు సూచించింది. అస్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్ల వల్ల జీవితానికి లేదా మరణానికి దారితీసే పరిణామాలు నొక్కి చెప్పింది.
3,30,000 కంటే ఎక్కువ మంది వైద్యులు సభ్యులుగా ఉన్న డాక్టర్ దిలీప్ భానుశాలి (అధ్యక్షుడు- ఇండియన్ మెడికల్ అసోసియేషన్) దీనిపై స్పందించారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చాలా మంది వైద్యుల చేతిరాత సరిగా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది వైద్య నిపుణులు బిజీగా ఉంటారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో.
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని.. రోగులు, కెమిస్ట్ లు ఇద్దరూ చదవగలిగేలా పెద్ద అక్షరాలతో ప్రిస్క్రిప్షన్లు రాయాలని మేము మా సభ్యులకు సిఫార్సు చేశాము. రోజుకు ఏడుగురు రోగులను చూసే డాక్టర్ దీన్ని చేయగలడు. కానీ మీరు రోజుకు 70 మంది రోగులను చూస్తే, మీరు దీన్ని చేయలేరు” అని డాక్టర్ దిలీప్ స్పష్టం చేశారు.