Agriculture Minister : రైతులని తప్పుదోవ పట్టించొద్దు..రాహుల్ కి తోమర్ వార్నింగ్

రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

Agriculture Minister  రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సోమవారం ఓ ఇంటర్వ్యూలో తోమర్ మాట్లాడుతూ..గ్రామస్తులు, పేదలు, రైతులు పడిన బాధ గురించి ఆయనకు ఎలాంటి అనుభవం లేదన్నారు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రోజుకొక అబద్ధం చెప్పడాన్ని రాహుల్ గాంధీ అలవాటు చేసుకున్నారని తోమర్ విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రకటనలను కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌ గాంధీ ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలపై పునరాలోచించాలని తోమర్‌ అన్నారు.వ్యవసాయ చట్టాల గురించి అప్పుడు అబద్ధాలు చెప్పారా లేదా ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారా అన్నదానిపై వారు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి లేదా అరాచక వాతావరణాన్ని సృష్టించడానికి రాహుల్‌ గాంధీ ప్రయత్నించకూడదని తోమర్‌ సూచించారు.

కాగా, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలలుగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా సోమవారం ఉదయం రాహుల్‌ గాంధీ… పార్లమెంట్ వరకు ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు