Don't Wash Your Mask
Covid Mask Mistakes : ప్రస్తుతం దేశంపై కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడింది. సెకండ్ వేవ్ లో మహమ్మారి తీవ్రత తీవ్ర స్థాయిలో ఉంది. రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఓవైపు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నా కేసులు భారీగా పెరుగుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.
ఈ క్రమంలో ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నెత్తీనోరు బాదుకుంటున్నాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా మాస్కులు వాడుతున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? మాస్కుల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? కరోనాను ఎదుర్కొనే అంశంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని వేధిస్తున్నారు. దీనిపై వైద్య నిపుణులు స్పందించారు. మాస్కు ధారణ, కరోనాను ఎదుర్కోనే విషయంలో ప్రజలు చేస్తున్న తప్పులను వారు తెలియజేశారు.
మాస్కుని అస్సలు తియ్యొద్దు:
”చాలామంది అతి సాధారణంగా చేస్తున్న తప్పు మాస్కుని సరిగా వేసుకోకపోవడం. జన సమూహంలో ఉన్న సమయంలో మాట్లాడుతున్నప్పుడు మాస్కుని ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు. కేవలం ఆహారం తీసుకునేటప్పుడు లేదా ఏదైనా తాగేటప్పుడు మాత్రమే మాస్కుని తియ్యాలి. మాస్కుని దేవుడి ఇచ్చి గిఫ్ట్ గా భావించాలి. మాస్కు సరిగా లేకపోతే, అనుకున్న ప్రయోజనం నేరవేరదు” అని గుజరాత్ లోని ప్రముఖ్ స్వామి మెడికల్ కాలేజీ డాక్టర్ హర్యాక్స్ పాఠక్ చెప్పారు.
మాస్కుని ఉతకొద్దు:
ఇక ప్రజలు చేస్తున్న మరో ముఖ్యమైన కామన్ మిస్టేక్.. మాస్కుని ఉతకడం. ఇది చాలా తప్పు. ప్రధానంగా ఎన్ 95 సర్జికల్ మాస్కుని అస్సలు ఉతక్కూడదు. అలా ఉతకడం వల్ల అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది. మాస్కుని ఉతకడానికి బదులుగా ఆరుబయట ఆరబెట్టాలి. లేదా ఎండలో డ్రై కానివ్వాలి. రెండు మూడు మాస్కులు కొనాలి. రోజుకొకటి చొప్పున వాడుకోవాలి. డబుల్ మాస్కు చాలా ముఖ్యం. చికిత్స కన్నా నివారణ మేలు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
కరోనా అంటే మరణం కాదు:
అన్నింటికన్నా ప్రధానమైన విషయం ప్రజలెవరూ భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. బెడ్ లేదా ఆక్సిజన్ సిలిండర్ అవసరం వచ్చినా వర్రీ అవ్వొద్దు. కోవిడ్ నుంచి అంతా కోలుకుంటున్నారు అనేది గ్రహించాలి. కరోనాతో మరణించే వారు ఉన్నారనే విషయంతో పాటు కోలుకుంటున్న వారూ ఉన్నారనేది మర్చిపోవద్దు. కరోనా సోకడం దురదృష్టకరమే. కానీ, కరోనా వచ్చిందంటే చావు వచ్చినట్టు కాదు. మాస్కు ధరించండి, భౌతిక దూరం పాటించండి.. అంతే.. ఇదేం పెద్ద సంక్షిష్టమైనది కాదు చాలా సింపుల్. అంతేకాదు వేరియంట్ల గురించి ప్రజలెవరూ అస్సలు భయపడొద్దు. వైరస్ ఏదైనా పరివర్తనం చెందడం సర్వ సాధారణం. అది మన చేతుల్లో లేదనే విషయాన్ని గ్రహించాలి.
హోమ్ రెమిడిస్ వల్ల ప్రయోజనం శూన్యం:
ఆవిరి పట్టడం లేదా కర్పూరం వాసన పీల్చడం..ఇలాంటి హోమ్ రెడిడిస్ మంచిది కాదు. మందులకు అవి ప్రత్యామ్నాయం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కావాలంటే అలాంటివి ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. చివరగా చెప్పే విషయం ఏంటంటే.. కరోనాను కట్టడి చేసేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్. ఇప్పటికే మన దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి మీద విశ్వాసం ఉంచాలి. ఆ టీకాల మీద నమ్మకం ఉంచినప్పుడే కోవిడ్ పై మనం చేస్తున్న పోరాటం ముగుస్తుంది” అని డాక్టర్ పాఠక్ అన్నారు.