‘దూరదర్శన్‌’ లోగోని కాషాయ రంగులోకి మార్చడంపై వివాదం.. షాక్ అయ్యానంటూ మమతా బెనర్జీ..

DD Logo: ఇకపై అది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా ఉంటుందని..

స్వయంప్రతిపత్తి ఉన్న పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌ చానెల్‌.. ప్రారంభమైనప్పటి నుంచి నీలం, ఎరుపు రంగు లోగోలతో కొనసాగింది. దాన్ని ఇటీవల కాషాయ రంగులోకి మార్చారు. ఈ నెల 16 నుంచి చానెల్ లోగో మారిందని, చానెల్‌ విలువల్లో ఎలాంటి మార్పులు లేవని దూరదర్శన్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఎన్నికల వేళ ఆ చానెల్ లోగో మార్చడం, అదీ కాషాయ రంగులో కనపడుతుండడం వివాదాస్పదమైంది.

దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఎన్నికలు జరుగుతోన్న వేళ మా దూరదర్శన్ లోగోను ఒక్కసారిగా కాషాయీకరణ చేసి, రంగు మార్చడాన్ని చూసి షాక్ అయ్యాననని చెప్పారు.

ఈ తీరు పూర్తిగా అనైతికమని, చట్టవిరుద్ధమని చెప్పారు. నేషనల్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ బీజేపీకి అనుకూలంగా ఎలా మారిందో ఈ తీరు చెబుతోందని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో, ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటున్న వేళ ఎన్నికల సంఘం ఈ తీరును ఎలా ఉపేక్షిస్తుందని అన్నారు. దీన్ని ఎన్నికల సంఘం వెంటనే ఆపివేయాలని, దూరదర్శన్ లోగో అసలు రంగు నీలంలోకి తిరిగి మార్చాలని డిమాండ్ చేశారు.

చానెల్ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మాజీ సీఈవో జవహర్ సిర్కార్ తన ఎక్స్ ఖాతాలో వీడియో రూపంలో మాట్లాడారు. ఎన్నికల ముందు దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడం బాధాకరమని చెప్పారు.

ఒక మతం, సంఘ్ పరివార్ రంగును న్యూట్రల్ గా ఉండే ఓ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ (దూరదర్శన్)కు వేయడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇకపై అది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా ఉంటుందని విమర్శించారు. ఈ కాషాయీకరణను తాను ఓ ఆందోళనకర పరిణామంగా చూస్తున్నానని తెలిపారు. కాగా, దూరదర్శన్‌ చానెల్‌ లోగో కాషాయ రంగులోకి మారడం పట్ల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Also Read: బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు.. బీజేపీలోకి వెళ్తారు: దాసోజు శ్రవణ్

 

ట్రెండింగ్ వార్తలు