ఆ వీడియోలు చూడడం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం నేరమే: సుప్రీంకోర్టు

చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూసివ్‌ మెటీరియల్‌ అనే పదంతో..

Supreme Court

Supreme Court: చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) చూడటం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం నేరమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆయా పనులు చేయడం నేరం కాదని ఇంతకుముందు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఆ తీర్పుపై కొన్ని ఎన్జీవోలతో పాటు చిన్నారుల సంక్షేమ సంఘాలు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో వీటిపై విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చడమే కాకుండా కేంద్ర సర్కారుకు కీలక సూచనలు చేసింది.

పోక్సో చట్టంలోని చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూసివ్‌ మెటీరియల్‌ అనే పదంతో మార్చాలని చెప్పింది. ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేయాలని సూచించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పార్లమెంటులో ఆ సవరణలు చేసేవరకు ఆర్డినెన్స్‌ జారీ చేసుకోవచ్చని పేర్కొంది. న్యాయస్థానాలు ఇక ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ పదాన్ని వాడొద్దని ఆదేశించింది.

కాగా, గతంలో ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని ఓ యువకుడు డౌన్‌లోడ్‌ చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అతడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడాన్ని నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల కింద చైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పు కాదని అప్పట్లో కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎన్జీవోలు సుప్రీంకోర్టుకు వెళ్లగా ఇవాళ తీర్పు వచ్చింది.

ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల స్వీకరణ.. రాముడి కోసం భరతుడు ఏం చేశాడో అలా చేస్తున్నానంటూ ఆమె ఏం చేశారో తెలుసా?