Drug Regulator Says No Need For Bridging Trials On Foreign Approved Vaccines
Drug regulator Emergency approval: కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. వ్యాక్సిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో విదేశాల్లో అత్యవసర అనుమతులు పొందిన పలు టీకాలకు దేశంలో పరీక్షలు లేకుండానే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థల టీకాలు దేశంలో త్వరగా అందుబాటులోకి వచ్చే వీలుంది.
విదేశీ వ్యాక్సిన్‌లకు అనుమతి ప్రక్రియల్లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది భారత ఔషధ నియంత్రణ సంస్థ. ఈ నిర్ణయంతో ఇకపై సులువుగా భారత్‌లో విదేశీ కోవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. విదేశీ వ్యాక్సిన్‌లకు అనుమతి ప్రక్రియల్లో మార్పులు చేసినట్లు వెల్లడించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ).. విదేశాల్లో ఆమోదించిన వ్యాక్సిన్‌లకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని స్పష్టంచేసింది.
డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన అన్ని వ్యాక్సిన్‌లకు అనుమతులు ఇచ్చేలా సవరణలు చేసింది. అమెరికా, యూకే, జపాన్ సహా పలు దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన, ఆమోదించిన అన్ని టీకాలకు భారత్‌లో పరీక్షలు చేయకుండానే వినియోగించవచ్చు అంటూ డీసీజీఐ వెల్లడించింది.