హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 90 స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం.
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కింగ్ మేకర్ గా జేజేపీ మారనుంది. ఇండిపెండెంట్లు,చిన్న చిన్న పార్టీలు, ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానున్నారు. కాంగ్రెస్ కూడా కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందని భావిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం,కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు జేజేపీ రెడీగా ఉంది.
అయితే సీఎం సీటు కోసం జేజేపీ పట్టుబడుతోంది. జేజేపీని ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ, దుష్యంత్ చౌతాలా కాంగ్రెస్ కు తన చేతులు చాచినట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి సీఎం పదవిని కోరినట్లు సమాచారం.
అటు మహారాష్ట్రలో మాత్రం బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145ను బీజేపీ దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 179 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 91స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.