టీవీ9 భారత్ వర్ష్ కు ఎన్నికల సంఘం మందలింపు

  • Publish Date - May 10, 2019 / 11:35 AM IST

ఢిల్లీ : 20 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వారి దగ్గర నుంచి కనపడకుండా పోయాయని, ఆధారాలు లేకుండా కధనాలు ప్రసారం చేసిన టీవీ 9 భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు  ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ చౌదరికి ఈసీ అధికార ప్రతినిధి లేఖ రాశారు. ఒక్క ఈవీఎం కూడా ఈసీ ప్రమేయం లేకుండా  బయటకు వెళ్ళలేదని ఆలేఖలో ఈసీ  స్పష్టం చేసింది.  ఈవీఎంలు, వివిప్యాట్లు ఎక్కడ ఉన్నాయో రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పరిశీలించి అన్ని అనుమతులు ఇచ్చిన తరువాతే వేర్ హౌస్ నుంచి బయటకు వెళతాయని తెలిపింది. ఈవీఎంల తరలింపు పారదర్శకంగా జరుగుతుంది. ఏకపక్షంగా నిరాధారంగా కధనాలు ప్రసారం చేయడం వల్ల సామాన్య ప్రజానీకంలో సందేహాలు వస్తున్నాయని ఈసీ ఆవేదన వ్యక్తం చేసింది. 

అభ్యర్థులు వారి‌ ప్రతిపాదిత అభ్యర్థులు, లేదా ప్రతిపాదిత ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన తర్వాతే  ఈవీఎంలు  బయటకు పంపబడతాయని ఈసీ వివరించింది. స్ధానిక సంస్థల ఎన్నికల‌ నిర్వహణ భాద్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని, అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయని ఈసీ తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనతో ఈవీఎంలలో మార్పులు జరిపితే అది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేని వ్యవహారమని, ఈవీఎంల విషయంలో ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడంలో భాగస్వామ్యం అవుతారని భావించడం లేదని ఈసీ అధికార ప్రతినిధి శెఫాలీ శరణ్ సున్నితంగా ఆ లేఖలో మందలించారు.