దేశంలో దాడులకు కుట్ర: 8మంది ఉగ్రవాదులు అరెస్ట్

  • Publish Date - January 9, 2020 / 08:27 AM IST

భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ మేరకు జిహాదీ ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. ఈ ముఠాకి చెందిన ఎనిమిది మందిని పక్కా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు.

వీరిలో ఐదుగురు తమిళనాడుకు చెందిన వారు అవగా, ముగ్గురు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను పోలీసులు చెన్నై కోర్టులో ప్రవేశపెట్టగా వీరిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

బెంగుళూరులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను మహ్మద్ హనీఫ్ ఖాన్ (29), ఇమ్రాన్ ఖాన్ (32), మహ్మద్ జాయిద్ (24)గా గుర్తించినట్టు తమిళనాడు పోలీసులు వెల్లడించారు. కర్నాటక పోలీసులు, ఇతర విచారణ సంస్థల సాయంతో నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అప్రమత్తమైన తమిళ నాడు పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా 8మందిని అరెస్ట్ చేశారు.