ట్రీట్మెంట్ అనంతం బిల్లు చెల్లించలేదన్న కారణంతో డాక్టర్లు ఓ వృద్ధుడిని హాస్పిటల్ బెడ్ కు కట్టివేశారు. మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
షాజాపూర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. కోవిడ్-19 పోరులో ప్రాణాలకు తెగించి ముందుండి ట్రీట్మెంట్ ను అందిస్తున్నారంటూ ఒకవైపు డాక్టర్లపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరో వైపు వైద్య చరిత్రకే మచ్చ తెచ్చే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
వృద్ధుడి కుమార్తె మాట్లాడుతూ… రూ.11వేల బిల్లు చెల్లించకపోవడంతో తన తండ్రి కాళ్లు, చేతులను తాళ్లతో బెడ్ కు కట్టేశారని తెలిపింది. హాస్పిటల్ లో అడ్మిట్ అయినపుడు రూ. 5 వేలు బిల్లు డిపాజిట్ చేశామని, అయితే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మరికొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చిందని, దీంతో బిల్లు ఎక్కువైందని, తమ దగ్గర చెల్లించేందుకు అంత డబ్బు లేదని హాస్పిటల్ డాక్టర్లకు చెప్పామని వృద్ధుడి కుమార్తె తెలిపింది.
అయితే మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనంటూ డాక్టర్లు వృద్ధుడిని మంచానికి కట్టేశారని వాపోయింది. అయితే హాస్పిటల్ వర్గాల వాదన మరోలా ఉంది. వృద్ధునికి మూర్చ ఉన్నందునే ఆ విధంగా మంచానికి కట్టేశామంటూ తెలిపాయి. మూర్చ కారణంగా వృద్ధుడు తనను తాను గాయపర్చుకోకుండా ఉండేందుకు అతని కాళ్లు,చేతులు బెడ్ కి కట్టేసినట్లు హాస్పిటల్ లోని ఓ డాక్టర్ తెలిపారు. మానవత్వం దృష్ట్యా వృద్ధుడి చెల్లించాల్సిన బిల్లులు అన్నింటినీ మాఫీ చేశామని తెలిపారు.
Madhya Pradesh: An 80-yr-old man found tied to bed with rope at a hospital in Shajapur allegedly over non-payment of hospital bill. Dist Collector says,‘We’ve sent a team to hospital to investigate matter. Police probe on. Report awaited. Action will be taken accordingly.'(06.06) pic.twitter.com/fWaY4nIi5z
— ANI (@ANI) June 7, 2020