వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు మేం సిద్ధమే: CEC సునీల్ అరోరా

One Nation One Election:దేశవ్యాప్తంగా వన్ నేషన్.. వన్ ఎలక్షన్ రావచ్చునంటూ ఇప్పటికే వార్తలు ఉన్న క్రమంలో.. ఇదే విషయమై ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా. “వన్ నేషన్.. వన్ ఎలక్షన్” అమలు చెయ్యడానికి మేం సిద్ధమేనని, అయితే, ఇదే విషయమై పార్లమెంట్‌లో విస్తృతమైన సవరణలు చేయవలసిన అవసరం ఉందని, ఆ తర్వాత… ‘వన్ కంట్రీ- వన్ నేషన్’ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది.” అని సునీల్ అరోరా ప్రకటించారు.

చట్టాన్ని సవరించాలని పార్లమెంట్ నిర్ణయించినట్లయితే, ఎన్నికల సంఘం వన్ నేషన్ వన్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని సునీల్ అరోరా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక దేశం ఒక ఎలక్షన్ పద్ధతి దేశానికి అవసరం అని అన్నారని, దానిపై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొంత సమయం పట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌తో సహా 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అంతుకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో జమిలి ఎన్నికలు (వన్ నేషన్.. వన్ ఎలక్షన్) భారత్‌కు ఎంతో అవసరమని అన్నారు. కొన్ని నెలల వ్యవధిలోనే పదే పదే ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలిగుతుందని, అందుకే వాటిని ఒకేసారి నిర్వహించడంపై దృష్టి సారించారు. రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లో జరిగిన శాసన వ్యవహారాల ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సదస్సులో ప్రధాని మోడీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చెయ్యగా.. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.