TTE Electric Shock : బాబోయ్.. రైల్వే స్టేషన్లో ఊహించని ప్రమాదం, మాట్లాడుతుండగానే కరెంట్ షాక్.. వీడియో వైరల్
రైల్వే స్టేషన్ లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతూ ఉండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు.
- Naveen
- Updated on- December 8, 2022 / 08:29 PM IST
TTE Electric Shock : ఒక్కోసారి ఎవరూ ఊహించని ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. మన తప్పేమీ లేకపోయినా ప్రమాదం బారిన పడాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే ప్రమాదంలో పడిపోతాం. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఒళ్లుగగుర్పొడిచే ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతూ ఉండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు.
రైల్వే ప్లాట్ ఫామ్ పై ఇద్దరు టీటీఈలు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడెన్ గా ఓ పొడవాటి కరెంట్ తీగ వచ్చి ఓ టీటీఈ తలపై పడింది. అంతే, అతడికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అలాగే రైలు పట్టాలపై పడిపోయాడు. కరెంట్ షాక్ కొట్టిన సమయంలో మంటలు కూడా వచ్చాయి. అప్పటివరకు అక్కడే మాట్లాడుతూ నిలబడిన మరో టీటీఈ.. కరెంట్ షాక్ కొట్టిన ఘటనను కళ్లారా చూసి బిత్తరపోయాడు. అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు. అసలేం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యాడు.
కరెంట్ షాక్ కారణంగా టీటీఈకి కాలిన గాయాలయ్యాయి. అలాగే రైలు పట్టాలపై పడటంతో కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. టీటీఈ ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
కరెంట్ షాక్ కొట్టడం, టీటీఈ రైలు పట్టాలపై పడిపోవడం.. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, అనూహ్యంగా కరెంట్ వైర్ ఎక్కడి నుంచి వచ్చి పడింది అనేదానిపై క్లారిటీ లేదు. అసలు అదెలా కట్ అయ్యింది? అనేది కూడా తెలియదు. కాగా, ఓ పక్షి ఆ కరెంట్ వైర్ ని విడిచిపెట్టిందని, సరిగ్గా అది టీటీఈ నెత్తి మీద పడిందని చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో.. నెటిజన్లను ఒళ్లు గగుర్పాటుకు గురి చేసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
