మాతృ హృదయం : బాలికను రక్షించిన ఏనుగు 

  • Publish Date - February 22, 2019 / 04:17 AM IST

జల్పాయిగురి: అడవిలో ప్రయాణిస్తుండగా స్కూటర్ మీద నుంచి కింద పడిపోయిన బాలికను ఏనుగు రక్షించిన వైనం పశ్చిమబెంగాలో లోని జల్పాయిగురిలో జరిగింది. గ్రామాలపై పడి ప్రజలపై దాడి చేసిన ఏనుగులను ఇంతవరకు  చూశాము, కానీ…. సాటి ఏనుగుల గుంపు నుంచి ఓ బాలికను కాపాడిన ఏనుగు సంఘటన జల్పాయి గురి అటవీ ప్రాంతంలో జరిగింది. నితుఘోష్ అనే వ్యాపారి పశ్చిమ బెంగాల్ లోని  గరుమర అటవీ ప్రాంతంలోని గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహాదారి 31పై   తన భార్య, 4 ఏళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్ పై ప్రయాణిస్తున్నాడు. అంతలో ఓ ఏనుగుల గుంపు జాతీయ రహదారి ని దాటడానికి అడవిలోంచి రోడ్డు మీదకు వచ్చింది. వాటిని తప్పించుకుని ముందుకు వెళ్లిన నితు ఘోష్ కు మరో ఏనుగుల గుంపు ఎదురు పడింది. ముందు వెనుక ఏనుగులు గుంపు ఉండటంతో కంగారులో ముగ్గురు స్కూటర్ పై నుంచి కింద పడ్డారు. 

అయితే కింద పడిన చిన్న పిల్లను ఏనుగుల మందలు రెండూ తొక్కకుండా ఒక ఏనుగు తన రెండు కాళ్ల మధ్య ఉండేలా చూసి రక్షణగా నిలబడింది. ఇంతలో ఆ రోడ్డు పై వచ్చిన  ట్రక్కు డ్రయివర్ పెద్దగా హరన్ మోగించటంతో  ఏనుగుల మందలు త్వరగా రోడ్డు దాటాయి. ఏనుగులు రోడ్డు దాటేంత వరకు రక్షణగా ఉన్న ఆ ఏనుగు కూడా  చివరికి అడవిలోకి వెళ్లిపోయింది.  నిజానికి ఈరోడ్డులో ఏనుగల మంద బారిన పడి గత కొద్ది నెలల్లో ఒకవ్యక్తి మరణించగా ఎందరో  గాయపడ్డారు. కానీ ఈ ఏనుగు ఎటువంటి హాని తలపెట్టకుండా బాలికను రక్షించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  రోడ్డు మీద పడటం వల్ల గాయాలైన నితూఘోష్, భార్య,కుమార్తెలను డ్రయివర్  ట్రక్కులో ఎక్కించుకుని  జల్పాయిగురి ఆస్పత్రిలో చేర్పించాడు.