Encounter
terrorists killed : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో నాగ్ బెరన్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నాగ్ బెరన్, తార్ సారకే అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఉగ్రవాదులు ఆర్మీ బలగాలపై కాల్పులు జరుపడంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన లంబూ అలియాస్ అద్నాన్ గా గుర్తించారు. లంబూ ఉగ్రవాది మసూద్ అజహర్ కు సమీప బంధువు.
అతనికి పుల్వామా దాడి కేసుతో సంబంధం ఉంది. మరొక ఉగ్రవాదిని గుర్తించాల్సివుంది. ఆర్మీ, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సోమవారం కుల్గామ్ ప్రాంతంలో లష్కరేకు చెందిన టాప్ కమాండర్ అమీర్ అహ్మద్ మీర్ ను ఆర్మీ హత మార్చింది.
మరోవైపు జమ్మూ రాజౌరీ జాతీయ రహదారిపై ఐఈడీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాల్ గోరా ప్రాంతంలో అనుమానాస్పద గతి విధులపై సమాచారం రావడంతో భద్రతాబలగాలు అక్కడికి చేరుకుని ఓ బాంబును నిర్వీర్యం చేశాయి. జమ్మూ రాజౌరీ రహదారిపై మూడు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.