Family Pension
Family Pension : పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాలకు ఊరటనిచ్చేలా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన నెల రోజుల్లోనే కుటుంబ సభ్యులకు పెన్షన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్లను ఆదేశించింది. పాత పెన్షన్ పథకం కింద ఉన్న, జాతీయ పెన్షన్ వ్యవస్థలో ఉన్న మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన మొత్తాలను కూడా ఆ కుటుంబానికి వెంటనే చెల్లించాలంది.
దీంతోపాటు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్నీ, ఎన్‌పీఎస్ పెన్షన్ కార్పస్ నూ కుటుంబ సభ్యులకు చెల్లించాలని తెలిపింది. కుటుంబ పెన్షన్‌ను ప్రారంభిస్తున్నప్పుడే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలంది.
నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ దీనిపై స్పందించారు. కేంద్రం ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాలు బాధిత కుటుంబాలకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా మంజిత్ సింగ్ పోరాటం చేస్తున్నారు. పాత పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ ఉద్యోగులకు అందాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగి కాంట్రిబ్యూషన్, రిటర్న్స్, ఎన్పీఎస్ పెన్షన్ కార్పస్.. కుటుంబ పెన్షన్ కు అదనంగా ఇవ్వాలన్న కేంద్రం ఆదేశం మాకు చాలా ఆనందం కలిగించింది అని ఆయన అన్నారు. అలాగే ఎన్పీఎస్ కార్పస్ లోని కాంట్రిబ్యూషన్, రిటర్న్స్ మీద ఉద్యోగికి పూర్తి హక్కు కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఇందులో 13లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు.