Statue
Statue Of Equality : అష్టాక్షరీ మంత్రంతో ముచ్చింతల్‌లో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో రెండు కీలక ఘట్టాలు కాగా.. అందులో ఒకటి రామానుజాచార్యుల మహావిగ్రహం జాతికి అంకితం ఇవ్వడం. ఈ రోజు రాత్రి ఆ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతం కానుంది. మరోవైపు…విశ్వక్సేన ఇష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్సేన ఇష్టిని నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ.
అభీష్టాలను నేరవేర్చేందుకు : –
మన అభీష్టాలను నెరవేర్చేందుకు కోసం విశ్వక్సేన ఇష్టి నిర్వహిస్తారు. చివరగా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా..వారి సంకల్పాలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతుంటాయి. భారతదేశంలో 108 దివ్యదేశ క్షేత్రాలున్నాయి. ఒకటి నేపాల్ లో ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవాలంటే శ్రమించాల్సి ఉంటుంది. దివ్యదేశ క్షేత్రాలు పూర్తిగా గ్రనైట్ రాయితో కట్టబడ్డాయి. జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాదం మోపనున్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహం జాతికి అంకింతం చేయనున్నారు.
ముచ్చింతల్ ఆశ్రమానికి ప్రధాని మోదీ : –
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొంటారు ప్రధాని మోదీ. విశ్వక్సేన ఇష్ఠి అనంతరం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భగవత్ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకోని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడే భగవత్‌రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించనున్నారు. సమతామూర్తి లేజర్ షోను తిలకించి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ.
భారీ భద్రత : –
ఇప్పటికే ముచ్చింతల్ ఆశ్రమాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ రోజు సాధారణ భక్తులకు అనుమతులు రద్దు చేశారు. కేవలం ప్రత్యేక పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. ప్రధాని భద్రతా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 8 వేల మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రయాణించే ప్రత్యేక వాహనాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ రోజు దాదాపు 6 గంటల పాటు మోదీ హైదరాబాద్‌లో గడపనున్నారు.