2014లో ఈవీఎంలు హ్యాక్ : బాంబు పేల్చిన US సైబర్ ఎక్స్‌పర్ట్

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా.

  • Publish Date - January 21, 2019 / 03:16 PM IST

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా.

లండన్: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా. 2014 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని సయ్యద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కుట్రకి కేంద్రం హైదరాబాద్ అని చెప్పి బాంబు పేల్చాడు. ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంల రూపకల్పన బృందంలో సభ్యుడైన షుజా.. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ విడుదల చేసే మాడ్యులేటర్‌తో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసినట్టు గుర్తించానని తెలిపాడు.

 

అందుకే.. గోపీనాథ్ ముండేని చంపేశారు:
ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పడమే కాదు.. లండన్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్వయంగా ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించాడు సయ్యద్. నాడు హ్యాకింగ్ విషయం బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేకు తెలుసని.. ఎన్నికలయ్యాక ఆయన్ని చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈవీఎం ట్యాంపరింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని సయ్యద్ చెప్పాడు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి, తాను అమెరికాకు రాజకీయ శరణార్ధిగా వెళ్లానని తెలిపాడు. భారత్‌లో వాడిన ఈవీఎంల తయారీలో తాను కూడా పాల్గొన్నానని సయ్యద్ చెప్పాడు. ఆ సమయంలో తాను ఈసీఐఎల్‌లో పని చేసేవాడినని వివరించాడు.

 

మత ఘర్షణలు పుట్టించారు:
లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014లో తెలుసుకున్నట్టు సయ్యద్ షుజా చెప్పాడు. ఈ రహస్యాన్ని గుర్తించిన తమ బృందం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందన్నాడు. బీజేపీ నేతలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించామని తెలిపాడు. హైదరాబాద్ శివార్లలో ఒక బీజేపీ నేత ఇంటికి తాము వెళ్లినట్టు వివరించాడు. అక్కడ తమపై కాల్పులు జరపగా తను గాయాలతో బయటపడినట్టు చెప్పాడు. ఈ కాల్పుల ఘటనను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్ కిషన్‌గఢ్‌లో మత కల్లోలాన్ని, హింసాకాండను సృష్టించారని ఆరోపించాడు. తన బృందంలోని ఇతర సహచరులను ఆ హింసలో చనిపోయినట్టు చూపించారని అన్నాడు. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్(యూరప్)తో లండన్‌లో సయ్యద్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ హాజరయ్యారు. 2014లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని సయ్యద్ షుజా చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.