2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. కాగా, మార్చిలో రంజన్ గొగోయ్ ని ప్రభుత్వం రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
అసోం ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థుల జాబితాలో రంజన్ గొగోయ్ పేరు ఉందని తనకు సమాచారం ఉందని మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ అన్నారు. . సీఎం అభ్యర్థిగా రంజన్ గొగోయ్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఇదంతా భాగమేనన్నారు.
అయోధ్య కేసు తీర్పుపై రంజన్ గొగోయ్ పట్ల బీజేపీ సంతోషంగా ఉందన్నారు. దీంతో ఆయన దశలవారీగా రాజకీయాల్లోకి ప్రవేశించారన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన నిరాకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన సులువుగా మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ కావొచ్చు లేదా ఇతర హక్కుల సంస్థలకు చైర్మన్ కావచ్చు. అయినా ఆయనకు రాజకీయ ఆశయం ఉంది కాబట్టే రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించారన్నారు.
మరోవైపు,అసోంలో కాంగ్రెస్ తదుపరి సీఎం అభ్యర్థిగా తాను ఉండబోనని మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చాలా మంది అర్హత గల అభ్యర్థులు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను మార్గదర్శక శక్తిగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్), వామపక్ష, ప్రాంతీయ పార్టీలతో సహా గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.