Farmer associations rejected union government invitation : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్రం రైతులను అప్రతిష్టపాలు చేయాలని చూస్తుందని విమర్శించారు. రైతులు చర్చలకు సిద్ధంగా లేరని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రైతులను మోసం చేయాలని చూస్తుందని చెప్పారు. దీనిపై రైతుల ఐక్య వేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు.
వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాల నేతలు చర్చించారు. అనంతరం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సవరణలు చేస్తామంటూ గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామని తెలిపారు.
రాతపూర్వక హామీలతో కేంద్రం ముందుకు రావాలన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి లిఖిత పూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామని తేల్చి చెప్పారు. చర్చలు సఫలం కావడానికి అనువైన వాతావరణం కేంద్రం కల్పించాలన్నారు. కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. సాగు చట్టాలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదన్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన రైతులు… రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలును అడ్డుకోనున్నాయి.