అన్నదాతల ఆగ్రహం….నవంబర్-5న రహదారుల దిగ్బంధం

Farmers’ nationwide road blockade on Nov 5 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. నవంబర్-5న దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేయనున్నట్టు అనేక రైతు సంఘాలు ఉమ్మడిగా ప్రకటించాయి. అంతేకాకుండా, నవంబర్-26,27న “ఢిల్లీ చలో” ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.



ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(AIKSCC) విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం…. ఏఐకేఎస్‌సీసీ నేతృత్వంలో దాదాపు 500 రైతుల సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు,రైతు సంఘాల నాయకులు మంగళవారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలకు,అదేవిధంగా ప్రతిపాదిత ఎలక్ట్రిసిటీ(సవరణ)బిల్లు2020కి వ్యతిరేకంగా రైతు సంఘాలు అన్నీ కలిసికట్టుగా పోరాడాలని,రైతు సంఘాల మధ్య పూర్తి కోఆర్డినేషన్ ఉండాలని నిర్ణయించారు. నవంబర్-5న దేశదేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం కార్యక్రమం ఉండబోతుందని AIKSCC ప్రకటనలో పేర్కొంది.



కేంద్రం తక్షణమే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని,అదేవిధంగా ప్రతిపాదిత ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలనే డిమాండ్ పైనే తమ ఫోకస్ ఉంటుందని తెలిపింది. ఈ డిమాండ్లపై దృష్టిపెట్టి రాష్ట్రస్థాయిల్లో,ప్రాంతీయస్థాయిల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనల్లో పాల్గొంటారని AIKSCC తెలిపింది. రైతుల ఉద్యమాన్ని సమన్వయం చేసేందుకు బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, గుర్నామ్‌సింగ్‌, వీఎం సింగ్‌, రాజు షెట్టి, యోగేంద్రయాదవ్‌తో కమిటీని ఏర్పాటుచేశారు.



మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ రైతు నేతలు కమిటీలుగా ఏర్పడి రైతులకు మార్గదర్శనం చేయాలని జాతీయ నేతలు సూచించారు. రాస్తారోకోలతోపాటు కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, అధికార బీజేపీ నేతల ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అనుకూల కార్పొరేట్‌ కంపెనీల ముందు కూడా నిరసన తెలుపాలని సంఘాలు నిర్ణయించాయి. ‘రైతుల ఆందోళన పేరు చెప్పి పంజాబ్‌కు గూడ్సురైళ్లు వెళ్లకుం డా కేంద్రం నిలిపివేయటానికి ఖండిస్తున్నాం. ప్రభుత్వ చర్య పంజాబ్‌ రైతులు, ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేయటమే. ప్రజాస్వామ్య దేశంలో ఇది అత్యంత దురదృష్టకరమైన విధానం’ అని ఏఐకేఎస్‌సీసీ తన ప్రకటనలో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు