ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతం..చర్చల విషయంలో అల్టిమేటం

  • Publish Date - December 3, 2020 / 01:18 PM IST

Delhi Farmers protest : చర్చల విషయంలో రైతు సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ఆందోళన నేటికి 8వ రోజుకు చేరుకుంది. ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం రెండో విడత చర్చలు జరపనుంది.



మరోవైపు ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీ సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు భారీగా తరలివస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు పంజాబ్‌-హర్యాణా సరిహద్దులకు పరిమితమైన ఈ ఉద్యమం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులవైపు వ్యాపించింది. మూడు రాష్ట్రాల అన్నదాతలు ఆందోళనకు దిగడంతో ఢిల్లీ పరిసరాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నగరానికి వచ్చే అయిదు మార్గాలను పోలీసులు మూసివేశారు.



హర్యాణా సరిహద్దులోని సింఘు, టిక్రిల వద్ద వారం రోజులుగా రైతుల ధర్నా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతాలైన ఫిరోజాబాద్‌, మేరఠ్‌, ఎటావాల నుంచి వేలాదిగా రైతులు వస్తుండటంతో నోయిడా సమీపంలోని చిల్లా సరిహద్దు మూతపడింది. వీరంతా గౌతం బుద్ధ ద్వార్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ వైపు ఉన్న ఘాజీపుర్‌ సరిహద్దులోని యూపీ గేట్‌ వద్ద కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. పొలం పనులు మానుకొని రైతులు ఆందోళనకు తరలివస్తున్నారు.



మరోవైపు రైతులకు మద్దతుగా ఈ నెల 8 నుంచి వాహనాలను నిలిపివేస్తామని ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రకటించింది. ఆందోళన ప్రారంభమైన మొదటి రోజు నుంచే రైతులకు మద్దతు ఇస్తున్నట్టు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంఘం ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సంఘం పరిధిలో 95 లక్షల లారీలు, 50 లక్షల బస్సులు, ట్యాక్సీలు ఉన్నాయి.



ఇవాళ ప్రభుత్వం రైతులతో రెండో విడత చర్చలు జరపనున్న నేపథ్యంలో… కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా…వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే దానిపై చర్చలు జరిపారు. మరోవైపు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరపాలని రైతు నాయకులు డిమాండు చేస్తున్నారు.