ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్ర ప్రభుత్వం

  • Publish Date - March 24, 2020 / 08:07 AM IST

కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24.. మంగళవారం, మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. 

ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేయనున్నారు. చట్టబద్దమైన, నియంత్రణ  చర్యలతో ఆర్థిక మంత్రి  దేశ ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. లాభాల్లోఉన్నప్పటికీ, తీవ్ర ఒడిదుడుకుల మద్య సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ అంచనాలతో భారీగా  పుంజుకున్నాయి.

మరోవైపు కరోనా వ్యాప్తిపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజు రాత్రి 8గంటలకు జాతినుద్దేశించిన ప్రసంగించనున్నారు. కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజలకు  సూచనలు చేయనున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలివ్వడం, లాక్‌డౌన్‌లను సీరియస్‌గా తీసుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

కాగా  వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో కేవలం 24 గంటల వ్యవధిలో ప్రత్యేకంగా  వార్ రూమ్ ఏర్పాటు చేసింది.

See Also |  రాజ్యసభ ఎన్నికలు వాయిదా