కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది: తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్

  • Publish Date - October 15, 2019 / 01:39 AM IST

‘అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం’. తన బతుకులో చీకట్లు ఉన్నాయని నిరాశపడని ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అని అనుకునేవారికి ఆమె ఆదర్శం. కళ్లు లేకపోయినా ఐఏఎస్ కావాలనే తన కలను సాకారం చేసుకుంది. ఆమె పేరు ప్రంజల్‌ పాటిల్‌. వయస్సు 30ఏళ్లు.

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ తన 6వ ఏటనే చూపు కోల్పోయింది. అయినా సరే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకుంది. ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో అంతర్జాతీయ వ్యవహారాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2016లో తొలిసారి యూపీఎస్సీ రాసి 773వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుతో తనకు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలు కావడంతో ఆమెకు ఇచ్చిన పోస్టును రద్దు చేశారు.

తర్వాత మళ్లీ యూపీఎస్సీ పరీక్షలు రాయగా.. ఆమెకు 124వ ర్యాంక్‌ వచ్చింది. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, ఏడాది శిక్షణలో భాగంగా కేరళలోని ఎర్నాకులం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఒకానొక టైమ్‌లో ఆమె వెల్లడించారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స కూడా విఫలం అయినట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

దేశంలో మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్‌గా ప్రంజల్ రికార్డు సృష్టించారు. ఇక మగవారిలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారి ఉన్నారు. 

ట్రెండింగ్ వార్తలు