Serpent Idols in Fisherman nets
Serpent Idols in Fisherman nets : కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మత్స్యకారులు చేపల వేటకోసం వేసిన వలలో రెండు సర్ప విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి చాలా పురాతనమైనవి.. ఇత్తడితో తయారు చేసినవి అని స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అళికోడ్ సమీపంలోని పుతియా కడపపురం ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రస్సల్ సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం సముద్రంలో చేపలకోసం వేసిన వలను బయటకులాగాడు. అందులో రెండు సర్ప విగ్రహాలను చూసి మత్స్యకారుడు ఆశ్చర్యపోయాడు. వాటిని ఒడ్డుకు తీసుకొచ్చి శుభ్రం చేశాడు. అవి పురాతన కాలం నాటి విగ్రహాలు అని, ఇత్తడితో తయారు చేశారని గుర్తించారు.
ప్రతి విగ్రహం బరువు దాదాపు ఐదు కిలోలు ఉంది. మత్స్యకారుడు ఆ విగ్రహాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. విగ్రహాలు సముద్రంలో ఎలా పడ్డాయి.. ఇవి దొంగిలించబడ్డాయా..? ఎవరైనా కావాలనే సముద్రంలో వేశారా..? అనే విషయాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సర్ప విగ్రహాలను స్థానిక పురావస్తు శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు.
ఇత్తడితో తయారు చేసిన సర్ప విగ్రహాలను ఇంటికి హాని నుండి రక్షణకోసం ప్రవేశ ద్వారం వద్ద ఉంచుతారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటిని ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని నమ్ముతారు.