Five including two children die after drinking tea in UP village in house
Uttar Pradesh : ఓమహిళ తనకు తెలియకుండా చేసిన పొరపాటుకు తన భర్త, ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు ప్రాణాలు తీసింది. అందరికి టీ పెట్టి ఇద్దామని టీ కాచి ఇచ్చింది. కానీ టీపొడి అనుకుని పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహార పౌడర్ తో టీ కాచి ఇచ్చింది. ఆ టీ తాగిన తన భర్త,ఇద్దరు బిడ్డలతో సహా భర్త తండ్రి, మరో వ్యక్తి మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని నాగ్లా కన్హై లో జరిగిన ఈ అత్యంత విషాద ఘటన స్థానికంగా విషాదంలో ముంచేసింది. తన చేతులారా భర్తను..బిడ్డలను పోగొట్టుకున్నానని ఆమె గుండెలు అవిసేలా ఏడ్చింది.
నాగ్లా కన్హై గ్రామానికి చెందిన శివానందన్ భార్య రోజులానే టీ పెట్టి ఇంట్లో వారికి ఇచ్చింది. అది తాగిన శివానందన్ (35), వారి ఇద్దరు మగపిల్లలు ఆరేళ్ల వయస్సున్న్ శివంగ్, ఐదేళ్ల దివ్యాన్ష్ తో పాటు మామ రవీంద్రసింగ్, పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే శివానందన్ తండ్రి రవీంద్ర సింగ్, పిల్లలు శివంగ్, దివ్యాన్ష్‌లు మృతి చెందారు. సోబ్రాన్, శివానంద్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అక్కడి నుంచి సైఫాయి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే క్రిమిసంహార పొడిని టీపొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టు సూపరింటెండెంట్ కమలేష్ దీక్షిత్ విచారణలో తేలింది. పాలలో కలిపిన పిచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.