దేశరాజధానిలో కరోనా కల్లోలం : వారే స్థానికులకు వైరస్ అంటించారా? 

  • Publish Date - March 31, 2020 / 11:16 AM IST

విమానాలు ఆగిపోయాయి. పడవలన్నీ నిలిచిపోయాయి. బస్సు చక్రాలకు బ్రేక్‌లు పడ్డాయి. అయినా కరోనా వైరస్‌ దేశంలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. అయినా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందని ఆరా తీస్తే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని జమాత్ సదస్సు లింక్‌లు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. వారానికి పైగా జరిగిన ప్రార్థనల్లో వందలాదిమంది విదేశీయులు పాల్గొన్నారు. వాళ్లే లోకల్‌ వాళ్లకి వైరస్‌ను అంటగట్టారు. వందలాది మంది బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతుంటే.. వైరస్‌ ఇప్పటికే వేలమందికి సోకిందనే సందేహాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.

మియాపూర్‌లో నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 15మందిని పోలీసులు గుర్తించారు. 10మందిని టెస్ట్‌లు కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ హఫీజ్‌పేట్‌‌కు చెందిన వీరంతా ఈనెల 13న ఢిల్లీ వెళ్లి 15న తిరిగి వచ్చారు. ఢిల్లీ మత సమావేశాలకు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 39 మంది హాజరైనట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినవారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. మరొకరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసో లేషన్‌లో మృతి చెందడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఢిల్లీ సమావేశానికి వెళ్లివచ్చిన 39 మందితో పాటు.. వారి బంధువులు, కాంటాక్ట్ అయిన 55 మందిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపించారు.

రెండేళ్లకోసారి జరిగే సదస్సు :
ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సు ముఖ్యోద్దేశం.. మతానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా చేయాలి..? వాటిని ముందుకెలా తీసుకెళ్లాలి అనే దానిపై చర్చించడం. రెండేళ్లకోసారి జరిగే సదస్సు కోసం సౌదీ అరేబియా, థాయ్‌లాండ్‌, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా దేశాల నుంచి వందలాది మంది మత ప్రచారకులు తరలివచ్చారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, హర్యానాల నుంచి వందలాది మంది హాజరయ్యారు. ఈ సదస్సు హజరత్‌ నిజాముద్దీన్ ఏరియాలో మూడు రోజుల పాటు జరిగింది.

వేలాది మంది పైగా ప్రార్థనల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కరోనా కలకలం రేపుతున్న వేళ.. ఆంక్షలు లెక్కచేయకుండా వేలాది మంది ఒక్కచోట గుమిగూడారు. పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఎక్కడపడితే అక్కడ తిరిగారు. కొంతమంది విదేశాల నుంచి వారం రోజుల ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడినుంచి వేర్వేరు రాష్ట్రాలను సందర్శించారు. వాళ్ల అత్యుత్సాహమే ముప్పు తెచ్చి పెట్టింది.