రాజ్యసభకు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ

Sushil Kumar Modi దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోడీని ఎంపిక చేసింది బీజేపీ. డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్​డీఏకు మెజార్టీ ఉన్న నేపథ్యంలో సుశీల్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది.



ఇదివరకు ఈ స్థానానికి ఎన్​డీఏ కూటమి తరపున లోక్​జనశక్తి పార్టీ వ్యవస్థాపకులు, దివంగత కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన మృతి చెందడం, అనంతరం ఎన్​డీఏ నుంచి ఎల్​జేపీ బయటకు రావడం వల్ల ఈ స్థానాన్ని సొంత పార్టీ నేతకే కేటాయించింది బీజేపీ .



కాగా, సుశీల్​ మోడీ 2005 నుంచి బీహార్​ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అయితే తాజా ఎన్నికల తర్వాత ఆయనకు ఈ పదవిని కేటాయించలేదు. అయితే.. సుశీల్‌ కుమార్‌ మోడీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.



ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర సీనియర్‌ నేతలతో కలిసి బీజేపీ అత్యధిక సీట్లను సాధించడంలో సుశీల్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. అందుకే ఇలాంటి సీనియర్​ నేతను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.